Sponsered By:

Monday, December 13, 2010

జిల్లాల వారీగా వైఎస్.జగన్మోహన్ "ఆకర్ష్ పథకం" అమలు!!! (YS Jaganmohan | Krishna dist | Akarsh | Congress | Regional)

File
FILE
కడప మాజీ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి "ఆకర్ష్ పథకాన్ని" జిల్లాల వారీగా అత్యంత రహస్యంగా అమలు చేస్తున్నారు. రైతుల పరామర్శ పేరుతో కృష్ణా జిల్లాలో జగన్ చేపట్టిన తొలి పర్యటనే కాంగ్రెస్‌లో కలకలం రేపింది. స్వయంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని జగన్ మాయలో పడిన నేతలు బుజ్జగించాల్సి వచ్చింది. ముఖ్యంగా, జగన్‌ ప్రభావం ఉండదని భావించిన నేతలు తమ అభిప్రాయాన్ని మార్చుకోక తప్పలేదు. దీంతో కాంగ్రెస్ పెద్దలు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు జగన్ అనుచరులుగా ముద్రపడిన వారికి ఏదో ఒకటి ఎర వేస్తూ బుజ్జగిస్తూ వచ్చారు. అయితే వీరు కాకుండా కొత్త ఎమ్మెల్యేలు, నేతలు జగన్ ట్రాప్‌లో పడటంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. 

తన తండ్రి ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తనకు లేదని పదేపదే చెపుతున్నప్పటికీ.. ఆయన మాటలు... చేష్టలు.. వ్యవహారశైలి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. 2011లో జరిగేవి సెమీ ఫైనల్స్‌గానూ, 2014 ఫైనల్స్‌ జరిగే ఎన్నికలు ఫైనల్స్‌గా పోల్చిన జగన్.. ఈ ముందుగానే తాను నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునే దిశగా పావులు కదుపుతున్నట్టు సమాచారం. 

ఇందుకోసం జగన్‌కు కుడిభుజంలా వ్యవహరిస్తున్న బంధువు వైవీ.సుబ్బారెడ్డి, తితిదే మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అమలాపురం ఎంపీ సబ్బం హరి, నెల్లూరు ఎంపీ మేకపాటి రామోహన్ రెడ్డి, అంబటి రాంబాబులు ఇలా ఒక్కో జిల్లాలో ఒకరు లేదా ఇద్దరు కీలక నాయకులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. 

వీరంతా ఇటు కాంగ్రెస్‌తో పాటు.. అటు ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీల నాయకులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. తన వైపు రావడానికి సుముఖత వ్యక్తం చేస్తున్న నేతలతో జగన్ స్వయంగా ఫోనులో మంతనాలు జరుపుతున్నారు. అందువల్లే కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. 

ఇదేవిధంగా హైదరాబాద్‌లో దివంగత నేత పి.జనార్ధన్ రెడ్డి కుమారుడు, శాసనసభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డితో జగన్ అనుచరులు నిరంతరం టచ్‌లో ఉంటున్నారు. తన పట్ల పార్టీ అనుసరిస్తున్న వైఖరి, పార్టీ నేతలెవ్వరూ తనను పట్టించుకోక పోవడంతో తీవ్ర అసంతృప్తికిలోనై గుర్రుగా ఉన్న ఈ యువనేత జగన్ వైపుకు మొగ్గు చూపే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 

ఇకపోతే.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ సొంత జిల్లా చిత్తూరులో ఆపరేషన్ ఆకర్ష్ పథకాన్ని మరింత పక్బంధీగా అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ బాధ్యతను కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు స్వీకరించగా, మంత్రి పదవి దక్కని సీనియర్ నేతలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుతూహలమ్మలు తమ వంతు సహకారం అందిస్తున్నట్టు సమాచారం. 

అలాగే, విశాఖపట్నం జిల్లాలో ఎంపీ సబ్బం హరి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వైవీ.సుబ్బారెడ్డి సమావేశమై జగన్ ఓదార్పు యాత్ర షెడ్యూల్‌ను ఖరారు చేయడం గమనార్హం. ఇలా జిల్లాల వారీగా వైఎస్ జగన్ ఆకర్ష్ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏది ఏమైనా.. జగన్ మాత్రం కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తూ ముఖ్యమంత్రితో పాటు అధిష్టానానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. 

ప్రజాకర్షణ, స్థానికంగా పట్టున్న నేతలను జగన్ తన వైపుకు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. పైపెచ్చు.. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకుని.. తాము అమలు చేస్తున్న వ్యూహంలో ఎక్కడా తప్పుదొర్లకుండా అత్యంత జాగ్రత్త వహిస్తూ జగన్ వర్గం ముందుకు పోతోంది. అయితే ఈ పరిస్థితిని వారించేందుకు కాంగ్రెస్ నేతల్లో ఏ ఒక్కరూ చొరవ తీసుకోక పోవడం గమనార్హం.

No comments:

Post a Comment